విజయవాడ: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను స్టేట్ గెస్ట్‌హౌస్‌కు తరలించి కేసుకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టనున్నారు.
సీఐ నాగరాజును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విజయవాడ సింగ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగరాజుకు మద్దతుగా కొందరు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో హైడ్రామా చోటుచేసుకుంది.
ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను సిట్ అధికారులు స్టేట్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు.
గాదె సాయికృష్ణ అదృశ్య కేసులో ఇప్పటికే సీఐ నాగరాజుపై కేసు నమోదు కావడంతో పాటు ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఆయన అరెస్టు కావడం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు సిట్ అధికారులు విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు.