తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో గోల్డ్ మ్యాన్‌గా పేరుగాంచిన సూర్య భాయ్‌పై మోసం కేసు నమోదైంది. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు ప్రకారం, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సన్నిహితుడినని చెప్పి విశ్వాసం కల్పించిన సూర్య భాయ్, తక్కువ ధరకే బంగారం అందిస్తానంటూ రూ.30 లక్షలు వసూలు చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత బంగారం ఇవ్వకపోవడంతో పాటు నగదు కూడా తిరిగి చెల్లించలేదని ఆరోపించారు.

డబ్బులు కోరుతూ బాధితులు సూర్య భాయ్ ఇంటికి వెళ్లగా, తన వద్ద ఉన్న మూడు ఐఫోన్లు ఇచ్చి వాటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పినట్లు సమాచారం. అలాగే మరో రూ.20 లక్షలకు చెక్ ఇచ్చి పంపించినట్లు బాధితులు తెలిపారు.

అయితే బాధితులు వెళ్లిపోయిన అనంతరం వారిపైనే సూర్య భాయ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి ఫోన్లు లాక్కెళ్లారని ఆరోపించాడు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో అసలు విషయాన్ని గుర్తించారు. బంగారం కొనుగోలు పేరుతో హిమాయత్‌నగర్, నీలోఫర్ ప్రాంతాల్లో బాధితులు సూర్య భాయ్‌కు రూ.30 లక్షలు చెల్లించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో అత్తాపూర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ కోసం కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.