జిల్లాలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్‌ రోడ్డులో ఈరోజు(మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గన్నవరం: జిల్లాలోని బీబీగూడెం సమీపంలోని పశ్చిమ బైపాస్ రోడ్డుపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ వెనుక నుంచి కారును ఢీకొట్టడంతో, ఆ కారు ముందున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు నుజ్జునుజ్జైపోయింది.

ఈ దారుణ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి ఉండటం అందరినీ కలచివేసింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ట్యాంకర్ ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమై, మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పొక్లెయినర్ సహాయంతో కారును తొలగించి మృతదేహాలను బయటకు తీశారు.

ప్రాథమిక విచారణలో కంటైనర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.