37 కిలోలకుపైగా బంగారం సీజ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధాలపై దర్యాప్తు

అస్సాంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించారు. ఖార్‌ఘలి ప్రాంతంలో బంగారం అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన దాడుల్లో సుమారు రూ.54 కోట్ల విలువైన 37.064 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్వాధీనం చేసుకున్న బంగారం భారత్–మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు చెందినదిగా అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

పోలీసులు గ్రూపులుగా విడిపోయి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బంగారంతో పాటు 13 గ్రాముల వెండి, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.3,755 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్ అస్సాం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బంగారం స్మగ్లింగ్ పట్టివేతల్లో ఒకటిగా భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన ఇతర నిందితులను గుర్తించే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి.