ఆలయ నిబంధనలకు విరుద్ధంగా కేక్ కటింగ్.. సైబర్ క్రైమ్ పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు

విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపై నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఘటన వివాదానికి దారితీసింది. గాలిగోపురం వద్ద ఓ యువతి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సౌజన్య రాజకుమారి అనే యువతి జూన్ 29 అర్ధరాత్రి గాలిగోపురం సమీపంలో కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేట్ చేసింది. అనంతరం ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దేవస్థానం అధికారులు స్పందించారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటరావు మాట్లాడుతూ, పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు ఆగమశాస్త్ర నియమాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. కొండపై ఇలాంటి కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని తెలిపారు.

ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసిన దేవస్థానం, నిబంధనలు ఉల్లంఘించిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే అర్ధరాత్రి సమయంలో ఆమెకు సహకరించిన ఆలయ సిబ్బందిపై కూడా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ ఘటన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్రైవేట్ భద్రతా సిబ్బందిలో ఒకరిని వెంటనే తొలగించాలని సంబంధిత భద్రతా సంస్థకు దేవస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.