ఆగ్రాలో సంచలనం.. అనుమానాస్పదంగా కొత్త టైల్స్ వేయడంతో బయటపడిన హత్య కేసు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ తన భర్తను హత్య చేసి, శవాన్ని ఇంటి బాత్రూం టైల్స్ కింద పూడ్చిపెట్టి 45 రోజుల పాటు కనిపించకుండా పోయాడంటూ నాటకం ఆడిన ఘటన సంచలనం రేపింది.

ఆగ్రాకు చెందిన సురేంద్ర కుమార్ శర్మ గత మే 18 నుంచి కనిపించకుండా పోయాడు. భర్త ఎక్కడికో వెళ్లాడని, త్వరలో తిరిగి వస్తాడంటూ అతడి భార్య రూబీ బంధువులు, స్థానికులను నమ్మించింది. అనంతరం మే 26న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. బంధువులు, పోలీసులు విస్తృతంగా గాలించినా సురేంద్ర ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది.

అయితే మరో కేసు విచారణలో భాగంగా పోలీసులు శుక్రవారం సురేంద్ర ఇంటికి వెళ్లగా, రూబీ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అదే సమయంలో సురేంద్ర సోదరుడు అనిల్ శర్మ అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

సోదాలో భాగంగా బాత్రూంలో కొత్తగా వేసిన టైల్స్, ప్లాస్టరింగ్ పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. అనుమానం రావడంతో టైల్స్ తొలగించి తవ్వకాలు చేపట్టగా, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సురేంద్ర మృతదేహం బయటపడింది. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

ప్రాథమిక విచారణలో సురేంద్రను హత్య చేసిన అనంతరం శవాన్ని బాత్రూంలో పూడ్చిపెట్టి, ఆధారాలు చెరిపివేసేందుకు మట్టి పోసి ప్లాస్టరింగ్ చేసి కొత్త టైల్స్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో రూబీ తన నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

అయితే హత్యకు ముందే బాత్రూం మరమ్మతుల కోసం మేస్త్రీలు, కూలీలను మాట్లాడి ఉంచుకోవడం ఈ నేరం పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.