ప్రియురాలిని కలుసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 22 ఏళ్ల యువకుడిని భారత ఆర్మీ అధికారులు తిరిగి పాకిస్థాన్ అధికారులకు అప్పగించారు. శనివారం కమాన్ అమన్ సేతు వద్ద అధికారిక ప్రక్రియల అనంతరం అతడిని పాక్ ఆర్మీకి అప్పగించినట్లు చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
చినార్ కార్ప్స్ తెలిపిన వివరాల ప్రకారం, మే 31న ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ దాటుతున్న సమయంలో జీషన్ అహ్మద్ మీర్‌ను భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం జులై 4న మధ్యాహ్నం కమాన్ అమన్ సేతు వద్ద అధికారికంగా పాకిస్థాన్ ఆర్మీకి అప్పగించారు. భారతదేశంలో ఉన్న సమయంలో అతడిని మానవీయ విలువలకు అనుగుణంగా, గౌరవప్రదంగా చూసుకున్నట్లు భారత ఆర్మీ పేర్కొంది.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ ప్రాంతానికి చెందిన జీషన్ అహ్మద్ మీర్‌కు కశ్మీర్‌లోని ఉరీ ప్రాంతానికి చెందిన ఐరమ్ బానోతో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతో అతడు నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి ప్రవేశించగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో ఉరీ ప్రాంతంలో ప్రియుడి కోసం వేచి ఉన్న ఐరమ్ బానోను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించారు.