జాహ్నవి అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్.. కియా కారు మిస్టరీపై పెరుగుతున్న అనుమానాలు

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో మరో కొత్త మలుపు చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో సీసీ కెమెరాల్లో కనిపించిన కియా కారు ప్రస్తుతం దర్యాప్తులో కీలకంగా మారింది. ఇదే కారు నర్సీపట్నం సమీపంలో జాహ్నవి తాతను ఢీకొట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, ఈ వాహనానికి చిన్నారి అదృశ్యంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సమగ్ర విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు.

చిట్టితల్లి జాహ్నవి ఎక్కడుంది? ఎవరి చెంత ఉంది? ఎలా ఉంది? అనే ప్రశ్నలకు నెల రోజులు గడిచినా సమాధానం దొరకలేదు. పామాయిల్ తోటలు, అటవీ ప్రాంతాలు, కొండలు, కాలువలు, గ్రామ పరిసరాలను పోలీసులు ఇంచు ఇంచుగా గాలించినప్పటికీ చిన్నారి జాడ లభించలేదు. అధికారులు శక్తివంచన లేకుండా అన్వేషణ కొనసాగిస్తున్నా కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

జాహ్నవి అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కియా కారు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇదే కారు తర్వాత నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతను ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, జాహ్నవి అదృశ్యం కేసుతో దానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అనుమానాలపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు.