యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్‌పై నమోదు చేసిన యూఏపీఏ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో పలు కీలక ఆరోపణలు చేశారు. నిషేధిత మావోయిస్టు భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ దేశ సమగ్రతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం, మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ వీడియోలు విడుదల చేయడంతో పాటు సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాటిని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని పేర్కొన్నారు.
ఏలూరులో నిర్వహించిన దళిత క్రిస్టియన్ సభలో కులాల మధ్య విభేదాలు సృష్టించేలా ప్రసంగించారని, అలాగే సనాతన ధర్మం, హిందూ దేవతలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
విచారణ సమయంలో రావణ్ పూర్తిస్థాయిలో సహకరించలేదని, కేసు నమోదు అనంతరం కొన్ని వీడియోలను తొలగించారని, డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
ఈ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో సోమవారం ప్రశ్న రావణ్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, ఈ ఆరోపణలపై ప్రశ్న రావణ్ లేదా ఆయన తరఫు న్యాయవాదుల స్పందన ఇప్పటివరకు వెలువడలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.