నెల్లూరు జిల్లా పోలీసు శాఖ చరిత్రలోనే అరుదైన నిర్ణయం చోటుచేసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం, కేసు విచారణలో లోపాల నేపథ్యంలో ఒకే పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందిపై ఒకేసారి చర్యలు తీసుకుంటూ జిల్లా ఎస్పీ అనిత వేజెండ్ల సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ చర్యలకు కారణమైన కేసు బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి (ఏఓ) శ్రీహరి హత్య. గత నెల 15న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన శ్రీహరి కేసును తొలుత సహజ మరణంగా భావించినప్పటికీ, అనంతర దర్యాప్తులో అది పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల వివరాల ప్రకారం, శ్రీహరి తన బావమరిది హరికృష్ణకు కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చడంతో పాటు కొంత నగదును అప్పుగా ఇచ్చారు. అనంతరం ఇల్లు నిర్మించుకోవాల్సి ఉండటంతో ఆస్తి, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో హరికృష్ణ బావను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది.
జూన్ 15న దైవ దర్శనం పేరుతో శ్రీహరిని పెంచలకోనకు కారులో తీసుకెళ్లిన హరికృష్ణ, తిరుగు ప్రయాణంలో చేజర్ల మండలం సమీపంలో వాహనాన్ని ఆపాడు. అక్కడ ముందే వేచి ఉన్న రవీంద్ర, యానాదయ్యలతో కలిసి శ్రీహరిని అదుపులోకి తీసుకుని, కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజెక్షన్‌ను రెండు మోతాదుల్లో ఇవ్వడంతో ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు నమ్మించి మృతదేహాన్ని స్వగ్రామం మినగల్లుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
శ్రీహరి మృతదేహంపై గాయాలు ఉండటంతో సహోద్యోగులు అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, ఆ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు రాకపోవడంతో కేసు ముందుకు సాగలేదు. అనంతరం అంత్యక్రియల సమయంలో కూడా మృతదేహాన్ని ఖననం చేయకుండా హరికృష్ణ ఒత్తిడితో దహనం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఇటీవల శ్రీహరి మిగిలిన ఆస్తిని కూడా తనకు ఇవ్వాలని హరికృష్ణ ఒత్తిడి చేయడంతో, మృతుడి భార్య లావణ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టగా, రవీంద్ర, యానాదయ్యలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో జరిగిన నిర్లక్ష్యంపై సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందిపై జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవడం రాష్ట్ర పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.