హనుమకొండ జిల్లా యేనుగులగడ్డలో సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు. దాడిలో 41 రకాల మందులను స్వాధీనం చేసుకోగా, కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

హనుమకొండ జిల్లా యేనుగులగడ్డ ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు నిర్వహించారు. బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన వైద్య అర్హతలు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు.

‘ఫస్ట్ ఎయిడ్ క్లినిక్’ పేరుతో నిర్వహిస్తున్న కేంద్రంలో తనిఖీలు చేపట్టిన అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన పెద్ద మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 41 రకాల మందులు లభించగా, అందులో 35 రకాల ఇన్‌స్టిట్యూషనల్ సప్లై మందులు ఉన్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న మందుల్లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, రక్తపోటు మందులు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.10 వేలుగా అంచనా వేశారు.

ప్రత్యేకంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లను అర్హతలేని వ్యక్తులు వినియోగించడం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశముందని డీసీఏ అధికారులు హెచ్చరించారు. మందుల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే లైసెన్స్ లేని వ్యక్తులకు లేదా నకిలీ వైద్యులకు మందులు సరఫరా చేసే మెడికల్ డీలర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఏ స్పష్టం చేసింది.