రెవెన్యూ సమస్యల పరిష్కార కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వలేదని బీజేపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి భాగస్వామ్య పార్టీలను పక్కన పెట్టి కేవలం టీడీపీకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంపై బీజేపీ, జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పట్టణంలో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తమ పార్టీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీజేపీ, జనసేన నేతలు ఆరోపించారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నప్పటికీ తమను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో తదితర అధికారులు పాల్గొన్నప్పటికీ కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులకు ఆహ్వానం అందకపోవడం వివాదానికి దారితీసింది.

“బద్వేల్ నియోజకవర్గంలో అధికారులకు టీడీపీ మాత్రమే గుర్తుందా? బీజేపీ, జనసేన నాయకుల అవసరం లేదా?” అంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.

ఈ పరిణామం బద్వేల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.