పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, ఆర్థిక చేరిక పథకాల అమలును మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మెగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై దృష్టి పెట్టిన కేంద్రం, ఇప్పుడు మరికొన్ని కీలక పథకాల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ కార్యాచరణ ప్రణాళికలో ప్రధానంగా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY), పీఎం స్వనిధి (PM SVANidhi), ప్రధాన్ మంత్రి జనధన్ యోజన (PMJDY), అటల్ పెన్షన్ యోజన (APY), జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), సురక్షా బీమా యోజన (PMSBY) వంటి పథకాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్, బీమా, పెన్షన్ సేవలను మరింత చేరువ చేయడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ఉంది. పథకాల లబ్ధిదారుల సంఖ్య పెంచేందుకు బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలతో సమన్వయం పెంచాలని కేంద్రం భావిస్తోంది.
ప్రత్యేకంగా స్వయం ఉపాధి, సూక్ష్మ వ్యాపారాల అభివృద్ధికి ముద్రా రుణాలు, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడంపై దృష్టి సారించనున్నారు. అలాగే సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశముంది.
పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర పథకాల అమలు, లబ్ధిదారుల చేరికను పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతమివ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.