దేశంలో బయోఫ్యూయల్స్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించింది.
పర్యావరణ హిత ఇంధనాల వినియోగాన్ని పెంచడం, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం పెరగడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు స్వచ్ఛమైన ఇంధన వినియోగానికి ఊతం లభించనుంది. అలాగే చెరకు, మొక్కజొన్న వంటి పంటలను పండించే రైతులకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతుండగా, తాజా నిర్ణయం బయోఫ్యూయల్ రంగానికి మరింత బలం చేకూర్చనుంది.