హైదరాబాద్: తెలంగాణను ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణ పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా 2028 జూన్ 2 నాటికి వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే బౌండరీ వాల్, రన్‌వే నిర్మాణ పనులకు టెండర్లు సిద్ధమయ్యాయని, మరో మూడు నుంచి నాలుగు వారాల్లో టెర్మినల్ భవన నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు.
వరంగల్ టెర్మినల్ భవనాన్ని కాకతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. విమానాశ్రయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో 253 ఎకరాల భూమిని అప్పగించడాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు.ప్రాజెక్టు అమలులో ఎలాంటి జాప్యం లేదని, తన హయాంలోనే తెలంగాణలో ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.
ఇక ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్-సివిలియన్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం సుమారు 1,500 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.