హత్య కేసు భయమా?.. కుటుంబంతో రైలు కింద పడి బలవన్మరణం! కోటి రూపాయల ఆశ.. ఒక హత్య.. చివరికి నలుగురి ప్రాణాలు!

నెల్లూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, గూడూరుకు చెందిన హరికృష్ణ తన బావ అయిన వ్యవసాయాధికారి శ్రీహరిని నమ్మించి కోటి రూపాయలకు పైగా విలువైన ఆస్తి, నగదును తన పేరిట రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆస్తిని తిరిగి ఇవ్వాలని శ్రీహరి కోరడంతో అతడిని అడ్డు తొలగించాలని కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పెంచలకోన ఆలయ దర్శనం పేరుతో శ్రీహరిని కారులో తీసుకెళ్లిన హరికృష్ణ, తన సహచరులు రవీంద్ర, యానాది సాయంతో కుక్కలను చంపేందుకు ఉపయోగించే విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అది గుండెపోటుతో జరిగిన మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

శ్రీహరి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసును లోతుగా విచారించిన పోలీసులు కుట్ర కోణాన్ని బయటపెట్టారు. ఈ కేసులో రవీంద్ర, యానాదిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగానే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం, సింగరాయకొండ రైల్వే స్టేషన్ రెండో ప్లాట్‌ఫారంపై హరికృష్ణ కుటుంబం కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంది. గూడ్స్ రైలు సమీపించగానే భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులతో కలిసి ఒక్కసారిగా పట్టాలపైకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అయితే కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడటానికి గల అసలు కారణాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. శ్రీహరి హత్య కేసులో అరెస్ట్ భయం, పెరుగుతున్న ఒత్తిడి కారణమై ఉండొచ్చనే అనుమానంతో పాటు ఇతర అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.