మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం.. రూ. 7 లక్షలు ఇస్తామన్న జగన్

అమరావతి: పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత ప్రతి కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నా కుటుంబానికీ అదే మొత్తంలో సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో స్పందించడంలో విఫలమైనప్పటికీ బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా, 4న ప్రమాదం జరిగిందని గుర్తుచేశారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు చిన్నా ఇంటికి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాడని, అనంతరం ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు.

మత్స్యకారుల కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఫిషరీస్ అధికారులు, జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించలేదని జగన్ ఆరోపించారు. రాత్రి 10:30 గంటలకే కలెక్టర్, మెరైన్ సీఐకి సమాచారం చేరినా తక్షణ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఉంటే కనీసం ఐదుగురు ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా తప్పిదాల నేపథ్యంలోనే ఏర్పాటైందని, ఆ కమిటీ నివేదికలోనూ లోపాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. ఘటన జరిగిన రోజే బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించలేదని విమర్శించారు.