అమరావతి: 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
గత రెండేళ్లుగా ప్రభుత్వం సమష్టిగా పనిచేసి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో మంచి ఫలితాలు సాధించిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను అధికార యంత్రాంగం సమర్థంగా అమలు చేసిందని అభినందించారు. ఆశించిన మార్పుల్లో కొంత మేర విజయవంతమైనప్పటికీ, ఇంకా పలు రంగాల్లో మెరుగుదల అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రతి శాఖ తాము సాధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సీఎం సూచించారు. ప్రతి మూడు నెలలకు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తూ జీఎస్‌డీపీ పురోగతిని విశ్లేషిస్తున్నామని చెప్పారు. 'స్వర్ణాంధ్ర–2047' విజన్‌ను 'వికసిత్ భారత్–2047' లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించామని, తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ వృద్ధికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించామని వెల్లడించారు.
ఇప్పటివరకు 19 ఎస్‌ఐపీబీ సమావేశాలు, 57 మంత్రివర్గ సమావేశాలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు. గత పాలనలో రాష్ట్రంపై పారిశ్రామికవేత్తల విశ్వాసం దెబ్బతిన్నప్పటికీ, ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చగలిగామని, ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మారుతోందని అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర వనరులను సమర్థంగా వినియోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగంలోనూ ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలు, ఖనిజ సంపద, కోస్తా జిల్లాల్లో ఆక్వా రంగానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్, సిలికా, చీమకుర్తి గ్రానైట్ వంటి విలువైన వనరులకు విలువ జోడించే పరిశ్రమలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.
టెక్నాలజీ, వనరులు, విజ్ఞానం మన వద్ద ఉన్నాయని, వాటిని సమర్థంగా వినియోగించే నాయకత్వమే కీలకమని చంద్రబాబు అన్నారు. పాలసీలు రూపొందించడం కంటే వాటిని సమర్థంగా అమలు చేయడమే ముఖ్యమని పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెలా ఆర్థిక నివేదికలను సమీక్షిస్తూ, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పనితీరును నిరంతరం పరిశీలిస్తామని సీఎం తెలిపారు.