హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మంగళవారం మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, తనను అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని మంత్రి సురేఖ వివరించారు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు సంబంధించిన అన్ని అంశాలను మీనాక్షి నటరాజన్‌కు వివరించినట్లు సమాచారం.
మంత్రి సురేఖ వాదనను ఓపికగా విన్న మీనాక్షి నటరాజన్, చిన్నచిన్న విషయాలను పెద్దవి చేయకుండా సంయమనం పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సురేఖ, తాను తన పని చేసుకుంటూ ఉంటే అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఈ వివాదంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లను కలిసి కూడా మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.