రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72 గంటల్లో గల్లంతైన మత్య్సకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించామని వివరించారు

విశాఖపట్నం: మత్స్యకారుల విషాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించవద్దని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సూచించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 72 గంటల్లో రూ.10 లక్షల పరిహారం అందించామని ఆయన తెలిపారు.

మంగళవారం విశాఖపట్నంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పట్టాభిరామ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు, సముద్ర ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో మరణించిన మత్స్యకారుల్లో ఎంతమందికి పరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో మరణించిన సుమారు 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పరిహారం అందించిందని వెల్లడించారు.

మానవత్వం గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, బాధిత కుటుంబాలను పరామర్శించినప్పటికీ ఎంత పరిహారం ఇస్తానో ప్రకటించలేదని విమర్శించారు.

బోటు ప్రమాదాన్ని కూడా వైసీపీ రాజకీయాలకు వాడుకుందని పల్లా ఆరోపించారు. ప్రమాదంపై ముందుగానే సమాచారం తెలిసినా ప్రభుత్వానికి తెలియజేయలేదని వైసీపీ నాయకత్వంపై మండిపడ్డారు. సరైన సమయంలో మత్స్యకారులే జగన్‌కు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

మత్స్యకారులను వైఎస్ జగన్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన పల్లా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ చిన్నకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు.