మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంతిమ దర్శనం కోసం కిర్లంపూడికి వచ్చిన ఆయన కుమార్తె క్రాంతికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ప్రత్తిపాడు సమీపంలోనే పోలీసులు ఆమె వాహనాలను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల అభ్యర్థన మేరకు తొలుత ఆమెను నిలిపివేసినా, చివరికి కేవలం కుటుంబ సభ్యులతోనే పోలీసు భద్రత మధ్య కిర్లంపూడి నివాసానికి తీసుకెళ్లారు.
ఉదయం సుమారు 8 గంటలకు ముద్రగడ నివాసంలోకి ప్రవేశించిన క్రాంతిని అభిమానులు, బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. తండ్రి భౌతికకాయానికి దగ్గరగా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఫ్రీజర్ బాక్స్‌ను తాకనివ్వలేదని సమాచారం. కుటుంబ సభ్యులతో పాటు ఆమె తల్లి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్లు తెలిసింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని క్రాంతిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమెను కారులో పంపించారు.
ఈ ఘటనకు కుటుంబ విభేదాలే కారణంగా చెబుతున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్రాంతి మద్దతు ప్రకటించగా, ముద్రగడ పద్మనాభం తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ రాజకీయ విభేదాల తర్వాత తండ్రీ–కూతుళ్ల మధ్య దూరం పెరిగిందని భావిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వాదన ప్రకారం, తాను మరణించిన తర్వాత కూడా కుమార్తె అంత్యక్రియలకు రాకూడదని ముద్రగడ ముందుగానే చెప్పినట్లు పేర్కొంటున్నారు. అదే కారణంగా ఆమె రాకను అడ్డుకోవాలని బంధువులు పోలీసులను కోరినట్లు సమాచారం. అయితే చివరి చూపు కోసం క్రాంతి విజ్ఞప్తి చేయడంతో, పోలీసుల పర్యవేక్షణలో కొద్దిసేపు మాత్రమే ఇంటికి అనుమతించారు. అక్కడ కూడా తీవ్ర అభ్యంతరాల నడుమ ఆమెను వెంటనే బయటకు తీసుకెళ్లారు.