న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనకారుల విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నిరసనలకు సంబంధించిన వీడియోలను ప్రస్తావించగా, "కోర్టు సమయాన్ని వృథా చేయకండి. మాకు వీడియోలు చూసే సమయం లేదు" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
పోలీసులు నిరసనకారులపై అతిగా బలప్రయోగం చేశారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ కూడా తన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించింది.
ఇంతకుముందు ఇదే పిటిషన్‌ను అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం సముచితం కాదని పేర్కొనడంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాగా, నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'చలో పార్లమెంట్' నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ నిర్వహించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడగా, అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.