రైల్వే లైన్, ఇన్నర్ రింగు రోడ్డు కోసం భూ సమీకరణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి.. తాడికొండలో గ్రామసభ

అమరావతి రైల్వే లైన్, ఇన్నర్ రింగు రోడ్డు, రాజధాని రేడియల్ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన భూ సమీకరణపై తాడికొండలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరై రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, అమరావతి భూ సమీకరణ ప్రక్రియ 2015లో ప్రారంభమైనప్పటికీ నిర్మాణ పనులు 2018లోనే మొదలయ్యాయని తెలిపారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు రాజధాని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ భవనాలను త్వరలోనే వినియోగంలోకి తీసుకురానున్నామని మంత్రి వెల్లడించారు. ఇక అమరావతి రైల్వే లైన్, ఇన్నర్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూములను రైతులు స్వచ్ఛందంగా భూ సమీకరణకు అందిస్తే పనులు మరింత వేగంగా చేపట్టగలమని విజ్ఞప్తి చేశారు.

తాడికొండ నుంచి అమరావతి రాజధానికి అనుసంధానించే ప్రధాన రహదారి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.