హనుమకొండ: ఏఐసీసీ మరియు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈరోజు (బుధవారం) హనుమకొండ డీసీసీ భవన్ వద్ద కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మరియు ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ, దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన 'నీట్' పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ భారీ నిరసన చేపట్టారు. డీసీసీ భవన్ వద్ద దిష్టిబొమ్మ దహనం అనంతరం, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖా గారు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో పాటు MLC బస్వరాజు సారయ్య, MLAs నాయిని రాజేందర్ రెడ్డి, కె. ఆర్. నాగరాజు, టిపిసిసి మెంబర్లు శ్రీమతి కుచ్చాన రావాలి, ఇవి శ్రీనివాస్ రావు, భట్టి శ్రీనివాస్ రావు, గ్రంధాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఏనుమముల మార్కెట్ ఛైర్మన్ శ్రీమతి పులి ప్రియాంక , కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నర్సింహా రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నాసీర్ అహ్మద్, జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్, మండల అధ్యక్షులు, హనుమకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధ్యక్షురాలులు పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో సామాన్యుల తరఫున, విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు మరియు ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టులు చేయించడం బీజేపీ అహంకారానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా కాంగ్రెస్ పార్టీ భయపడదని, ప్రజల తరఫున పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న 'నీట్' పరీక్ష పేపర్ లీకేజీ కావడం ఈ కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ పేపర్లు అమ్ముకుంటున్న విద్యా మాఫియాకు ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు.