రంపచోడవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొంతసేపు టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.
సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని పేర్కొంటూ, తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని, పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా చదువుకునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అలాగే పీ4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. "మన పిల్లలే మన భవిష్యత్తు, వారి విద్యా నైపుణ్యాలే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది" అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.